by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:14 PM
మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఒక ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు కొత్త పద్ధతులను ప్రయోగిస్తున్నారన్నారు.ఇందులో భాగంగానే మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతోపాటు క్రిప్టో కరెన్సీ, ఆగ్రో గార్మెంట్స్, హెర్బల్ అండ్ హెల్త్, గృహ పరికరాలు వంటి వాటిపైన పెట్టుబడులు పెట్టి అధిక మొత్తంలో లాభాలు గడించవచ్చు అని నమ్మించి ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారన్నారు.ఈ స్కీమ్ ల ప్రధాన లక్ష్యం విలాసవంతమైన వస్తువులు అందజేస్తామని,సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, విదేశీ యాత్రలకు పంపిస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో ఈ స్కీమ్లను నిర్వహిస్తున్న సైబర్ నేరగాళ్లు మొదటగా కొంత డబ్బుతో ప్రాథమిక సభ్యత్వాన్ని కల్పిస్తారన్నారు.
సభ్యత్వం పొందిన వారితో మరికొంతమందిని చేర్పిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ప్రజలను ప్రలోభపెడుతూ కోట్లలో డబ్బులు కొల్లగొట్టడం ఈ స్కీమ్ ల ప్రధాన లక్ష్యమన్నారు.ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, ఇలాంటి స్కీమ్ ల పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.ఇలాంటి వాటిని నియంత్రించాలంటే వాట్సప్ యాప్,టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో వచ్చే అనుమానిత లింకులను,apk files, అప్లికేషన్స్ ను ఎవరు కూడా ఓపెన్ చేయడం కానీ, ఇన్స్టాల్ చేయడం కానీ చేయవద్దన్నారు. సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయినట్లుగా భావిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.సమీప పోలీస్టేషన్ లలో కానీ పిర్యాదు చేయాలన్నారు.లేదా కమీషనరేట్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్టేషన్లోనైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చన్నారు.