by Suryaa Desk | Thu, Jan 23, 2025, 12:15 PM
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలితీవ్రత నానాటికి పెరుగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు చలికారణంగా గజగజ వణికిపోతున్నారు.గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా యాదాద్రి, భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లి వాగులో కారు ప్రమాదానికి గురైంది. పొగమంచు రోడ్డును కప్పేయడంతో వాగులోకి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి మండలంలో ఉదయం 9 గంటల వరకు పొగమంచు దగ్గలేదు. వరంగల్ రహదారిపై రోడ్లు పొగమంచుతో వాహనాలు కనిపించక ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాహనదారులు వాహనాలకు లైట్లు వేసుకుని వేగాన్ని తగ్గించుకుని ప్రయాణం చేశారు.హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పటాన్‌చెరులో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాజేంద్రనగర్ 10.5, ఖమ్మంలో 18, రామగుండంలో 12.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలి, కాలుష్యం వల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.