by Suryaa Desk | Wed, Jan 22, 2025, 09:22 PM
గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్‌లో నిర్వహించిన గ్రామసభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు తీసుకొస్తున్నామని చెప్పారు. రేషన్ దుకాణల్లో ఇక నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయయోగ్యమైన భూములకు ఏటా ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చేలా చేయడమే తమ విధానమని చెప్పారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు.