by Suryaa Desk | Wed, Jan 22, 2025, 04:47 PM
రేషన్ కార్డుల కోసం ఏడాది క్రితం దరఖాస్తు ఇస్తే ఇంతవరకు దిక్కు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఏపీలో గెలిచిన వెంటనే పెన్షన్ పెంచుతానని చెప్పిన చంద్రబాబు... చెప్పిన విధంగానే పెన్షన్ ను పెంచారని కితాబిచ్చారు. రేవంత్ మాత్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అందరికీ పరమాన్నం పెడతామని ఎన్నికల సమయంలో చెప్పారని... ఇప్పుడు పంగనామాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... అదే పరంపర కొసాగిస్తోందని చెప్పారు. సిద్ధిపేట పట్టణంలోని చెర్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రైతులకు రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో చెబుతున్నారని... "దమ్ముంటే ఇక్కడకు రా చూపెడతా"అని సవాల్ విసిరారు. రుణమాఫీ సగం కూడా చేయలేదని మండిపడ్డారు. పాక్షికంగా రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను పెట్టి గ్రామసభలు నిర్వహిస్తున్నారని అన్నారు. రేవంత్ కు దమ్ముంటే గ్రామసభలకు రావాలని ఛాలెంజ్ చేశారు. రైతుబంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామసభల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని హరీశ్ విమర్శించారు. ఏడాదిలోనే రేవంత్ వ్యతిరేకతను మూటకట్టుకున్నారని అన్నారు.