by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:13 PM
తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు అలర్ట్.. కోడిగుడ్డులోని పోషక విలువలను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల్లో గుడ్లు కూడా పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎన్‌ఈసీపీసీ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.సాధారణంగా రేషన్ షాపుల్లో పప్పులు, బియ్యం, నూనెలు వంటి నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తుంటారు. అయితే గుడ్డులోని పోషకాల దృష్ట్యా రేషన్ ద్వారా వీటిని కూడా సప్లై చేయాలని ఎన్‌ఈసీపీసీ చెబుతోంది. ఈ క్రమంలో గుడ్డు ప్రాధాన్యతను, అందులోని పోషక విలువలను వివరిస్తూ కౌన్సిల్ రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్‌ను మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ బాలస్వామి, పౌల్ట్రీ ఇండియా వ్యవస్థాపకుడు పొట్లూరి చక్రధర్‌రావు సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 6 గుడ్లు, అంగన్‌వాడీల్లో గర్భిణులకు రోజుకు 2 గుడ్లు, పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న వారికి నెలకు 30 గుడ్లు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఎన్ని గుడ్లు తిన్నా ఆరోగ్య సమస్యలు రావని, గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారమని, కొలెస్ట్రాల్పెరుగుతుందన్న అపోహను వీడాలన్నారు.రేషన్ కార్డు ద్వారా ప్రజలకు కూడా నెలకు కనీసం 30 గుడ్లు అందిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారని చెప్పుకొచ్చారు. తగిన పోషకాలు వారికి అందుతాయని వివరించారు.
ఈక్విప్ మ్యాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయసింగ్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జోనల్ ఛైర్మన్ ఎశేఖర్‌రెడ్డితోపాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎన్‌ఈసీపీసీ తాజా ప్రతిపాదననపై రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, అంగన్‌వాడీల్లో విద్యార్ధులకు, గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా గుడ్లు అందిస్తుంది. ఒక వేళ సర్కార్ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే రేషన్ కార్డు దారులకు కూడా ఉచితంగా ఇస్తారా? లేదా సబ్సిడీతో పంపిణీ చేస్తారా? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.