by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:11 PM
డ్రైవర్లు వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు సాగించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేషం అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గేట్ వద్ద మంగళవారం రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణ తదితర అంశాలపై డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేషం మాట్లాడుతూ.. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్లు నడిపించే వాహనదారులు సీటుబెల్ట్ పెట్టుకోవాలన్నారు. యూటర్న్ చేస్తున్నప్పుడు వెనక నుండి వస్తున్న వాహనాలను వారి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఇండికేటర్స్ వేయాలని సూచించారు. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లు జాతీయ రహదారులు ఉపయోగించరాదని, వాకింగ్ కు ఇతర మార్గాలను ఎంచుకోవాలన్నారు. వానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై పార్కు చేయరాదని, ఒకవేళ తమ వాహనం బ్రేక్ డౌన్ అయినట్లయితే వెనకవైపు ఉన్న రెప్లెక్టివ్ ట్రయాంగిల్ ఉంచాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షిస్తే, రక్షించిన వారిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తింపుతారనే ఆపోహాలు చాలామందికి ఉంటాయి, కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 సెక్షన్ 134 ఏ ప్రకారం రోడ్డు ప్రమాదాల బారిన పడిన బాధితులను రక్షించినందుకు చట్టపరంగా నగదు, ప్రశంసలుంటాయని తెలిపారు. ఇలాంటి వారికి గుర్తింపునిచ్చేందుకు రోడ్డు రవాణా మరియు రవాణా మంత్రిత్వ శాఖ వారు 'స్కీమ్ ఫర్ గుడ్ సమారిటన్' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం అక్టోబర్ 15 2021 నుండి మార్చి 31 2026 వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ పథకం ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులని త్వరగా గోల్డెన్ అవర్‌లోపు హాస్పిటల్లలో చేర్చినట్లయితే వారికి 25000 రూపాయల నగదు మరియు ప్రశంస పత్రం అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అశోక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.