by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:36 PM
ప్రజా పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్, ఎంపీడీవో బాలయ్య, తహసిల్దార్ దివ్య, ఏవో నరేష్, ఎంపీవో శ్రీనివాస్ అన్నారు. బుధవారం తిమ్మక్ పల్లి, అంకిరెడ్డిపల్లి, లింగారెడ్డిపల్లి, రాయపోల్, గొల్లపల్లి, రామారం, బేగంపేట గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నూతన పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులు ఎవరైనా జాబితాలో పేర్లు రాకుంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అంకిరెడ్డిపల్లి, తిమ్మక్ పల్లి, రాయపోల్ మండల కేంద్రం గ్రామసభలలో అధికారులు ప్రకటించిన జాబితాలో నిజమైన అర్హుల పేర్లు రాలేదని అనర్హుల పేర్లు జాబితాలో రావడం పట్ల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో కాలయాపన చేయడం తప్ప పథకాలు అమలు చేసింది లేదని తీవ్రంగా విమర్శించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కుటుంబ సభ్యుల పేర్లు మీద భూమి ఉన్నప్పటికీ మహిళల పేర్లు జాబితాలో రావడం పట్ల గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పథకం భూమిలేని వ్యవసాయ కూలీలకు వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 2023 -24 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 20 రోజులు ఉపాధి హామీ పనిచేసి ఉండాలని నిబంధన ఉండడంతో చాలా మంది అర్హత కోల్పోయారు. భూమిలేని వారికి చాలామందికి జాబ్ కార్డు లేవని, అలాంటివారు ఉపాధి హామీలో ఎలా పనిచేస్తారని అధికారులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పేర్లు రాకపోవడంతో అభ్యంతరం తెలిపారు. రైతు భరోసా పథకంలో ఇప్పటివరకు రుణమాఫీ పూర్తిగా కాలేదని ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం జాబితా పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా పాలన దరఖాస్తు, సమగ్ర కుటుంబ సర్వేలో దరఖాస్తున్న నూతన రేషన్ కార్డులు, కొత్తగా పేర్లు చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నవారి పేర్లు జాబితాలో రాకపోవడంతో ప్రజలు నిలదీశారు. ఆత్మీయ భరోసా పథకంలో జాబ్ కార్డు ఉండి 20 రోజుల పని చేసి ఉండాలని నిబంధనలను తొలగించాలని, భూమిలేక జాబ్ కార్డు కలిగి ఉన్న వారికి ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రఘుపతి, ఆర్ఐ భాను ప్రకాష్, ఏఈఓ లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.