by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:23 PM
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో ఎనిమిది కార్ల ముందుబాగాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి మరో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేశారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు బయలుదేరారు. ఈ క్రమంలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి మంత్రి.. కారు ఆపాలని సూచించడంతో డ్రైవర్ బ్రేక్ వేశాడు. మంత్రి కారు సడెన్ గా ఆగడంతో కాన్వాయ్ లో ఉన్న మిగతా కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో కాన్వాయ్ లోని ఎనిమిది కార్లు ముందు బాగంలో స్వల్పంగా దెబ్బతిన్నాయి.ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాన్వాయ్ లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ తిరిగి బయలుదేరారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ విషయం తెలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేయగా.. తనతో పాటు ఎవరికీ ఏమీ కాలేదని, అంతా బాగుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.