by Suryaa Desk | Fri, Jan 24, 2025, 04:30 PM
దావోస్ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 50 వేల నుంచి 75 వేల ఉద్యోగాలు లభించే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పెద్దగా తెచ్చిన పెట్టుబడులు లేవన్నారు. అభివృద్ధి, పెట్టుబడులపై బీఆర్ఎస్ ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.దావోస్‌లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల పెట్టుబడులపై నమ్మకం కుదిరిందన్నారు. తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. తమని విమర్శించే ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడమే బీఆర్ఎస్ పని అని విమర్శించారు. గత ప్రభుత్వ పాలన కారణంగా నెలకు ఆరున్నర వేల కోట్ల రూపాయల వడ్డీని కడుతున్నట్లు చెప్పారు. మంచి జరుగుతుంటే ప్రశంసించడం నేర్చుకోవాలని ప్రతిపక్షానికి హితవు పలికారు