by Suryaa Desk | Thu, Jan 23, 2025, 08:20 PM
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటుందని, అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఒక్క బీసీకి రుణాలు ఇవ్వాలేదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెరుకు మణికంఠ ఆధ్వర్యంలో గురువారం కాచిగూడలోని అభినందన్ హోటల్‌లో సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందన్నారు. బీసీల కులవృత్తుల వారికి బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా బీసీ కార్పొరేషన్లు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పారిశ్రామికరణ ఆదరణ తగ్గడంతో రాష్ట్రంలో బీసీ కులాల వారికి ఉపాధి కరువైందని ఆరోపించారు. బీసీ కుల వృత్తుల వారికి యంత్రాలు కొనుగోలు చేయడానికి రూ.50 లక్షల వరకు రాయితీని అందజేయాలని డిమాండ్ చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం బలంగా ఉందని, అందుకు రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. బీసీలు రాజ్యాధికార దిశగా ఉద్యామించాలని పిలుపునిచ్చారు. బీసీలు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం వచ్చినప్పడే బీసీల బతుకులు మారుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గొరిగె మల్లేశ్, నీలం వెంకటేశ్, జి.అంజి, వేముల రామకృష్ణ, నందగోపాల్, రాజు, భాస్కర్, రఘుపతి, ప్రవీణ్‌కుమార్, నిఖిల్, రవియాదవ్, బాలయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.