by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:57 PM
కొత్త రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటో లేకుంటే ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని ఫొటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీఎం ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ సొంతం చేసుకుంటుందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చినా గత పదేళ్లలో ఏనాడూ బీఆర్ఎస్ నేతలు తనను పిలవలేదన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు తాను నిధులు తీసుకువస్తే... బీఆర్ఎస్ వాళ్లు పనులు ప్రారంభించారని విమర్శించారు. కరీంనగర్ కోసం తాను ఎంత కష్టపడినప్పటికీ ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవలేదని ఆరోపించారు.మోదీ ప్రభుత్వం అందించిన నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు.