by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:48 PM
వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని చెప్పారు. ‘‘వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే. ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోంది. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది. కేంద్రం తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోవాలి. కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కలు గుంజుకుంటే ఎలా? తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రాలు నామమాత్రం అవుతాయి.పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై వివక్ష చూపింది. రాష్ట్రం సిఫార్సు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లు సిఫార్సు చేశాం. ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారు.. మనకు నాలుగైనా ఇవ్వలేదు. ఈ వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తా. మందకృష్ణకు పద్మశ్రీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రొఫెసర్ల వయోపరిమితి 65కు పెంచే ఆలోచన ఉంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.