by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:36 PM
తెలంగాణలో కొన్ని గంటల్లో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్‌ను హెచ్చరిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బిగ్ బాంగ్ పేల్చారు. తెలంగాణలో రేపు (జనవరి 26న) నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే.. క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. గ్రామ సభలు నిర్వహించి.. ఆ జాబితాల్లో ఉన్న పేర్లను కూడా ప్రకటించారు. కొన్ని గంటల్లో ఈ పథకాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
నిరుపేదలకు ఇస్తున్న ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులపై కాంగ్రెస్ ఫొటోలు పెడితే కూడా.. ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వబోమన్నారు. తామే స్వయంగా ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో గందరగోళం ఏర్పడినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇచ్చే ఇళ్లు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరు చేసే ఇండ్లేనని బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు.. రేషన్ కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వమే జారీ చేయనుందని తెలంగాణ ప్రజలకు తెలియజేయేందుకు యత్నించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వచ్చే విభేదాల వల్ల.. మరి అర్హులైన వారికి ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తారా.. ఆపేస్తారా అన్న అనుమానాలకు తెర తీసినట్టయింది.
మరోవైపు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి గురువు కేసీఆరేనని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ఏం చేశారో.. రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పనిలో కొత్తదనం ఏమీ లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని.. కాళేశ్వరం అవినీతి ఎక్కడకు పోయిందని.. కేసీఆర్‌ను జైల్లో ఎందుకు వేయడం లేదని ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. మరోవైపు.. ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కూడా ప్రశ్నించారు. దావోస్‌కు రెండుసార్లు పోయినా.. పెట్టుబడులపై స్పష్టత లేదని బండి సంజయ్ ఆరోపిస్తూ.. శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.