by Suryaa Desk | Fri, Jan 24, 2025, 07:37 PM
ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రంలో రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చి, చివరి వ్యక్తికి కూడా ఈ పథకాలు అందేలా చూశాడని కొనియాడారు. బీహార్ మొదటి కాంగ్రెస్సేతర సీఎం కర్పూరీ ఠాకూర్ కూడా ప్రజలకు అద్భుతమైన పాలన అందించారని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు.
కర్పూరీ ఠాకూర్ విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. మాతృభాషను పరిరక్షించుకునేలా హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారన్నారు. 70వ దశకంలో దేశంలో ఇందిరా గాంధీ పాలనకు వ్యతిరేకంగా జనతా పార్టీ ద్వారా నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు. ఆ ఉద్యమంలో కర్పూరీ ఠాకూర్‌ది కీలక పాత్ర అన్నారు. బీహార్‌లో మద్యపాన నిషేధం తీసుకువచ్చారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబం అన్నట్లుగా తయారైందని, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలు కూడా ఆ కుటుంబానికే ఇచ్చుకున్నారని విమర్శించారు. దేశంలో నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ పాలన చేయకూడదని భావించారని, ఆ ఉద్దేశంతోనే అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పాలన చేసిందని విమర్శించారు.