by Suryaa Desk | Sat, Jan 25, 2025, 07:41 PM
76వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందు దేశమంతా సిద్ధమైంది. రిపబ్లిక్ డే వేడుకల్లో ఒక రాష్ట్రం తరపున శకటం ప్రదర్శిస్తున్నారంటే.. తమ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని గర్వంగా దేశానికి చాటిచెప్తున్నట్టే. అలాంటి వేదికపై శకటం ప్రదర్శించే అవకాశం తెలంగాణకు కేవలం మూడు సార్లే వచ్చింది. ఈసారి కూడా ఆ ఛాన్స్ రాలేదు.
2025 రిపబ్లిక్ డే వేడుకల్లో 15 రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో బీహార్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం లభించింది. ఈసారి ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మలతో కూడిన శకటాన్ని ప్రదర్శించనున్నారు. అయితే.. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించలేదు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు కేవలం మూడంటే మూడే సార్లు రిపబ్లిక్ డే వేడుక్లలో తెలంగాణ శకటాలు ప్రదర్శించే అవకాశం రావటం గమనార్హం. 2015, 2020, 2024 వేడుకల్లో మాత్రమే తెలంగాణకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నాయి. అయితే.. ఇందులో పాల్గొన పోవటానికి కారణాలేంటి అన్న అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలు ప్రదర్శించేందుకు ఔత్సాహిక రాష్ట్రాలు ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ థీమ్, ఎలాంటి మెస్సేజ్, శకటం డిజైన్, దాని ప్రాముఖ్యత గురించిన అన్ని వివరాలతో కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి అప్లికేషన్స్‌ని నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. అందులో ప్రత్యేకమైన కాన్సెప్ట్, కొత్తదనం, స్పష్టమైన సృజనాత్మక వ్యక్తీకరణ లాంటి పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్రాల శకటాలను నిపుణుల కమిటీ సెలెక్ట్ చేస్తుంది. అందులోనూ.. పరేడ్‌లోని సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని.. ఎన్ని శకటాలు ప్రదర్శించగలమని లెక్కలేసుకుని తుది నిర్ణయం తీసుకుంటారు.
అయితే.. గతంలో తెలంగాణ రాష్ట్ర శకటం లేకపోవటానికి రకరకాల కారణాలున్నట్టు తెలుస్తోంది. కొన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆయా కారణాల వల్ల సెలెక్ట్ కాకపోవటం.. మరికొన్ని సార్లు అసలు దరఖాస్తే చేయకపోవటం లాంటి కారణాలున్నాయి. కాగా.. బీఆర్ఎస్ హయాంలో.. 2015లో బోనాల థీమ్‌తో మొదటిసారి, 2020లో తెలంగాణ సంస్కృతి, పండుగలు కాన్పెప్ట్‌తో బతుకమ్మ లాంటి ప్రత్యేకమైన సంప్రదాయలు ఉట్టిపడేలా శకటాలు ప్రదర్శించారు.
ఇక.. గత ఏడాది 2024లో తెలంగాణకు సంబంధించిన శకటం వేడుకల్లో ప్రదర్శన ఇచ్చింది. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట తెలంగాణ శకటం ఆకట్టుకుంది. చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు తదితర పోరాట యోధులతో శకటాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.
అది కూడా శకటాలకు దరఖాస్తు చేసుకునే సమయం మించిపోయినా.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేయటంతో.. రక్షణ శాఖ ప్రత్యేక చొరవతో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. ఈసారి ఎందుకు లేదన్నదానికి కారణాలు తెలియాల్సింది ఉంది. అయితే దరఖాస్తయినా చేయకపోయి ఉండాలి. చేసినప్పటికీ.. గతేడాది అవకాశం ఇవ్వటం వల్ల ఈసారి తెలంగాణ స్థానంలో ఇంకో రాష్ట్రానికి ఛాన్స్ ఇచ్చే క్రమంలో పక్కన పెట్టి ఉండాలి. లేదా.. ఆకట్టుకునే థీమ్ లేకపోవటమైనా కారణమై ఉండాలి.