by Suryaa Desk | Sat, Jan 25, 2025, 07:54 PM
తెలంగాణలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (జనవరి 26న) కేవలం పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే.. పథకాలు పూర్తిగా అమలు చేసేందుకు మాత్రం ఇంకా సమయం పడుతుందని ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు. ఈ మేరకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శనివారం (జవనరి 25న) రోజున బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో.. రేపు నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలిపిన సీఎం.. ప్రారంభోత్సవానికి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మండాలనికొక్క గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాలు సమర్ధవంతంగా అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ఏమాత్రం అన్యాయం జరగొద్దని, అనర్హులైన వారికి లబ్ధి చేకూర్చితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
సమీక్ష తర్వాత.. సెక్రటేరియట్‌లో మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. నాలుగు పథకాలను రేపు (జనవరి 26న) ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున.. రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియలో ఎవరూ మిగిలిపోరని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
రేపు ఉదయం 11:30 గంటల వరకు రిపబ్లిక్ డే వేడుకులు నిర్వబహించుకుని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర వరకు నాలుగు సంక్షేమ పథకాలను మండలంలోని ఓ గ్రామంలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎంపిక చేసిన గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందిస్తామని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో రేపు 4 సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొత్తగా వచ్చిన అప్లికేషన్ల కారణంగా రేపు మండలానికి ఓ గ్రామంలో నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామని మిగతా చోట్ల ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులైన పేదవారు ఎవరూ అభద్రతకు లోనుకావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
అయితే.. ముందుగా చెప్పినదాని ప్రకారం.. జనవరి 26 నుంచి నాలుగు పథకాలు వంద శాతం అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించారు. కాగా.. ఇప్పుడు మాత్రం లాంఛనంగా ప్రారంభించి.. ఆ తర్వాత మెల్లగా అమలు చేస్తామని సెలవివ్వటంతో.. ప్రజల్లో నిరాశ నెలకొంది. ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. గ్రామసభల ద్వారా బయటపడగా.. ఇప్పుడు పథకాల అమలు చెప్పిన సమయానికి కాకుండా మరింత తాత్సారం కావటం ప్రజల సహనానికి పరీక్ష పెట్టనుంది.