by Suryaa Desk | Fri, Jan 24, 2025, 08:20 PM
బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర (Gold price) రూ.83 వేలు దాటింది. ఈ మార్కు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.83,100కి చేరుకున్నట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.200 పెరిగి రూ.82,700కి చేరినట్లు అసోసియేషన్ పేర్కొంది. అటు వెండి సైతం కిలోకు రూ.500 మేర పెరిగింది. క్రితం ట్రేడింగ్‌లో రూ.93,500గా ఉన్న వెండి కిలో తాజాగా రూ.94 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్సు 2780 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. వెండి 31.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్(Trump) టారిఫ్‌ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్నికల వేళ ప్రపంచ ఆర్థికంపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇతర అంశాల్లోనూ మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే దానిపైనా ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని భావిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరుగుతోందని యాక్సిస్ సెక్యూరిటీస్‌లో రీసెర్చ్ అనలిస్ట్ దేవేయ గగలానీ అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మున్ముందు బులియన్ మార్కెట్లో బంగారం ధర గమనాన్ని నిర్దేశించనున్నాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన అనలిస్ట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు.