by Suryaa Desk | Fri, Jan 24, 2025, 07:42 PM
కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమాలాకర్‌తో కలిసి పాల్గొన్న బండి సంజయ్ కుమార్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు పొన్నం ప్రభాకర్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. గంగుల కమలాకర్‌తో కూడా గ్యాప్స్ పోయినాయని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
పొన్నం ప్రభాకర్‌కు, గంగుల కమలాకర్‌కు మధ్య కొంచెం గ్యాప్ ఉన్నా.. అది కూడా పోతదని ఆకాంక్షించారు. కరీంనగర్‌లోని హౌజింగ్ బోర్డులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం.. బహిరంగ సభలో మాట్లాడిన బండి సంజయ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమానికి.. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మూడు పార్టీల నేతలు ఒకే వేదికను పంచుకోవటం అరుదైన సన్నివేశం కాగా.. ఇదే వేదికపై నుంచి.. తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని బండి సంజయ్ ప్రకటించటం ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తోంది.
"మంత్రి పొన్నం అన్నతో ఎలాంటి గ్యాప్స్ లెవ్వు.. పోయినయ్. నాకూ గంగుల కమలాకర్ అన్నకు గ్యాప్స్ ఏమీ లెవ్వు.. ఇక కొంచెం మా.. ప్రభాకరన్నకు, కమలాకరన్నకు ఉన్నట్టుంది.. ఈసారి అది కూడా పోతది ఉండది ఇగ. ఈ స్టేజితో క్లోజ్ ఇగ. ఇందులో ఏం డౌట్ లేదు. అందరం కలిసి ఉందాం. అందులో ఏం ఇబ్బంది లేదు. ఈరోజు ఈ వేదిక చూశాక పొంగులేటి శీనన్న పరేషాన్ అయితుండి. మా ఖమ్మంలో పోతే ఊకె కొట్టుకుంటరయ్యా.. ఏడికి పోయినా లొల్లి అయితుంది. కరీంనగర్లో వీళ్లంతా నవ్వుకుంటా ప్రశాంతంగా అందరూ కలిసి ఉన్నారంటే.. అది అభివృద్ధికి ప్రధాన ఉదాహరణ అని.. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరూ కలిసి ఉన్నారని ఒక మంచి సంకేతం పోయింది." అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
కరీంనగర్ అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి పని చేస్తామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని.. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. ఆ నిధులతో అభివృద్ధి చేసుకుందామని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.