by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:43 PM
కరీంనగర్ రాజకీయాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. మొన్ననే.. ఉమ్మజి జిల్లా మీటింగులో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య జరిగిన ఘర్షణ చర్చకు దారి తీయగా.. నిన్న (జనవరి 24) కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో అన్ని పార్టీల నేతలు ఒకే వేదికను పంచుకోవటమే కాకుండా.. అందరి మధ్య గ్యాప్స్ పోయాయని, అభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేస్తామని స్వయంగా కేంద్రం మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కట్ చేస్తే.. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. సునీల్ రావుతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాషాయ తీర్థం పుచ్చుకోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో కార్పొరేటర్లు శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న, వేణు తదితరులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బండి సంజయే స్వయంగా కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. నిన్న జరిగిన స్మార్ట్ సిటీ పనుల ప్రారంభ సభకు కరీంనగర్ మేయర్ సునీల్ రావు అధ్యక్షత వహించి.. అన్ని పార్టీల నేతలను ఆహ్వానించి సజావుగా జరిపించగా.. అంతకుముందు కూడా గంగుల కమాలాకర్, బండి సంజయ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో.. తెల్లారగానే బీఆర్ఎస్ కండువా కప్పుకుని గులాబీ పార్టీ నేతలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
మరోవైపు.. బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీద సునీల్ రావు తీవ్ర ఆరోపణలు చేయటం గమనార్హం. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆయన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గంగుల కమలాకర్ భాగోతం బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్లు ముడితే చాలు.. ఆ తర్వాత గంగుల కనిపించడని ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన ప్రతి కుంభకోణం వెనక గంగుల పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.
"బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ నగర అభివృద్ధి జరిగింది. వినోద్‌ను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నేనే చెప్పాను. పోటీ చేస్తే బండి సంజయ్‌ను తట్టుకోలేవని చెప్పాను. బ్యాంకాక్, శ్రీలంకలో పత్తాలాడే సంస్కృతి గంగులది. డ్రైనేజీ నీళ్ళు మళ్ళించకుండా మానేరు రివర్ ఫ్రంట్ పేరిట 200 కోట్లు వృథా చేశారు. నగర అభివృద్ధి ఆగిపోవద్దని నేను ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నా. చెక్ డ్యామ్‌లు, రోడ్ల కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే. నాకు మేయర్ పదవి రాకుండా గంగుల ఆనాడే అడ్డు పడ్డాడు. కేంద్ర నిధులతోనే నగరం అభివృద్ధి సాధ్యమైంది. నాపై ఏ విచారణకైనా సిద్ధం. నీ అవినీతి బరాబర్ బయట పెడుతా.. చెంచాగాళ్ళతో ఫేస్ బుక్ పోస్టులు పెట్టడం కాదు.. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రా." అంటూ గంగుల కమలాకర్‌కు మేయర్ సునీల్ రావు సవాలు విసరటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.