by Suryaa Desk | Mon, Jan 27, 2025, 03:50 PM
గ్రామాల్లోని రైతు కూలీలతో పాటు మున్సిపాలిటీల్లోని రైతు కూలీలనూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలోకి తీసుకు రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామాల్లోని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇచ్చి, మున్సిపాలిటీల పరిధిలోని రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతు ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తులను స్వీకరించింది.గ్రామాల్లోని రైతు కూలీలకు ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొంటూ నారాయణపేటకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు.రాష్ట్రంలో 129 మున్సిపాలిటీలు ఉన్నాయని, ఈ మున్సిపాలిటీలలో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టుకు తెలిపారు. గ్రామాల్లోని రైతు కూలీలకు ఈ పథకం ఇచ్చి, పట్టణ కూలీలకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా సమానంగా చూడాలన్నారు