by Suryaa Desk | Mon, Jan 27, 2025, 12:44 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో తెలంగాణలో ప్రతి ఇంటా సంక్షేమ సంబరం జరుపుకుంటున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను పురస్కరించుకొని చిట్కుల్ గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులతో కలిసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి గడప ముందు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆదివారం నుంచి మరొక నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. రైతుకు పంట పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏటా రెండు విడతలుగా 12 వేల రూపాయలు అందించేలా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలను అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూర్చేలా నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రిమండలికి తెలంగాణ ప్రజల పక్షాన ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,లబ్ధిదారులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.