by Suryaa Desk | Mon, Jan 27, 2025, 02:19 PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.గతంలో బెయిల్ కోసం తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బి.వి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.10 నెలలుగా పిటిషనర్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారు. అందువల్ల పిటిషనర్ ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. ట్రయల్ కు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని పిటిషనర్ ను హెచ్చరించింది.సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దకు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్ పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్ని ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ఫోన్ ట్యాపింగ్ లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే ఈ విచారణకు హజరయ్యారు.