by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:14 PM
పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు తగదాలపై పీసీసీ కమిటీ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే పటాన్‌చెరులోని కాంగ్రెస్ పార్టీలో కొత్త , పాత గోడవలపై పీసీసీ ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. అమీన్ పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆదివారం నాడు కమిటీ సభ్యుడు , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి వచ్చారు. కాట శ్రీనివాస్ గౌడ్‌తో కమిటీ సభ్యులు, నీలం మధు భేటీ అయ్యారు. అమీన్ పూర్ కాంగ్రెస్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేసి కుర్చీలు విరగొట్టి, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం లోపల పెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పటాన్‌చెరుకు వచ్చామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలను సద్దుమణిగేలా చూస్తామని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. అందరితో మాట్లాడి నివేదిక తయారు చేస్తామని అన్నారు. పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య సద్దుమణిగేలా చూస్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.