by Suryaa Desk | Mon, Jan 27, 2025, 04:10 PM
కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అబద్దాలతో పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇద్దామని బీఆర్ఎస్వీ నేతలకు, విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ మాట్లాడారు.జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ వర్ధంతి.. బాపును తలచుకుంటూ.. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఒరిజినల్ గాంధీ.. ఈ డూప్లికేట్ గాంధీలకు బుద్ధి తెచ్చేలా ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. జనవరి 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతుంది కాబట్టి.. 420 హామీలపై ప్రశ్నిద్దాం. గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి వినతపత్రం ఇస్తూ.. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కలలోకి వచ్చి.. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేట్టు ఆదేశాలు ఇవ్వండంటూ వినతిపత్రం ఇద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో రైతుల ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించి.. ఆ రైతుల కుటుంబాల్లో భరోసా నింపింది. ఆదిలాబాద్‌లో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 420 రోజుల్లో 410 మంది రైతులు చనిపోయారు. గురుకులాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హయత్‌నగర్‌లో మైనార్టీ గురుకులంలో ఇవాళ ఓ విద్యార్థిని చనిపోయింది. మెట్‌పల్లిలో ఆరుగురు విద్యార్థులకు పాము కరిచిందని కేటీఆర్ గుర్తు చేశారు.గురుకుల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి.. బీఆర్ఎస్వీ నేతృత్వంలో గురుకులాల బాట కార్యక్రమం చేపడితే.. ప్రభుత్వం కళ్లు తెరిచింది. మంత్రులు, కలెక్టర్లు గురుకులాల్లో పర్యటించారు. రెండు రోజులు మంత్రులు డ్రామాలు ఆడి.. మళ్లీ గురుకులా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 మంది పైచిలుకు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వీరందరని ఆదుకోండి.. ఇకనైనా మొద్దునిద్ర వీడండి అని ప్రభుత్వానికి సూచించాం. 420 హామీల మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.