by Suryaa Desk | Wed, Jan 29, 2025, 08:24 PM
హనుమకొండలోని నగర శివారు ప్రాంతానికి చెందిన బాలిక (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వరంగల్‌కు చెందిన ఓ బాలుడి (17)తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. అయితే.. మంగళవారం (జనవరి 28న) ఇంట్లో ఎవరూ లేరు. ఎవరి పనుల మీద వాళ్లు వెళ్లిపోయారు. ఇంట్లో తానొక్కతే ఒంటరిగా ఉంది. అసలే యుక్తవయసు.. అపై ప్రేమలో ఉంది. పైగా ఇంట్లో కూడా ఎవరూ లేరు. ఎప్పుడోగానీ ఇలాంటి ఏకాంత సమయం దొరకదనుకుందేమో వెంటనే తన ప్రియుడికి విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలిచింది. ఇంకేముంది.. నిమిషాల్లోనే ఆ ప్రేమికుడు ప్రియురాలి ఒళ్లో వాలిపోయాడు. ఆ ఇద్దరు ప్రేమికులు ప్రేమలో మునిగితేలుతున్నారు.
సరిగ్గా అదే సమయంలో.. ఆఫీసు ముగించుకుని అమ్మాయి తండ్రి ఇంటికి వచ్చాడు. ఏకాంతంలో పడి ఘడియ వేసుకోవటంతో పాటు సమయాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు ఆ ప్రేమికులు. ఆ బాలుడితో కూతురు సన్నిహితంగా ఉండగా.. తండ్రి కళ్లారా చూశాడు. తన కూతురిని అలా చూసిన.. ఆ తండ్రి కోపంతో ఊగిపోయాడు. అదే కోపంలో బాలుడిపై చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా.. ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని బాలుడి గొంతు కోశాడు.
బాధితుడు హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగెత్తటంతో.. బాలిక తండ్రి కూడా ఆ వెనుకే వెళ్లాడు. మరోవైపు.. తండ్రి తనను అలాంటి పరిస్థితిలో చూడటంతో.. తన ముఖం ఎలా చూపెట్టుకోవాలన్న అవమానానికి గురైందో లేదా తనను కూడా ఏమైనా చేస్తారేమో అని భయపడిందో.. తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఇంట్లో గడియ పెట్టుకొని ఉరేసుకుంది.
ఇది గమనించిన తండ్రి.. స్థానికుల సహాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా.. ఆ బాలిక అప్పటికే విగతజీవిగా మారిపోయింది. దీంతో.. ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. స్వల్పంగా గొంతు తెగిన ఆ బాలుడిని వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.