![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 04:42 PM
కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ధ్వంసం చేస్తుంటే హైడ్రా, కమిషనర్ రంగనాథ్ ఎక్కడకు వెళ్లారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. హెచ్‌సీయూ పరిధిలో మూడు చెరువులు ఉన్నాయని, చెరువులను కాపాడతామని చెబుతున్న హైడ్రా ఎక్కడకు వెళ్లిందని ప్రశ్నించారు. కేసీఆర్ హరితహారం చేస్తే, రేవంత్ రెడ్డి హరిత సంహారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుతో ఆ ప్రాంగణంలోని జంతువులు చిత్రహింసలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు.బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో మాట్లాడి పోలీసులను అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ భూముల వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకమాడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోకి పోలీసులు రాకుండా అడ్డుకోవచ్చని వ్యాఖ్యానించారు. డ్రోన్ కెమెరాలతో జేసీబీ వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.బీజేపీ సహాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని, కానీ పార్కులను, అడవులను విక్రయిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలోని భూమిని ఇవ్వవచ్చు అన్నారు. 400 ఎకరాల భూముల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గురువు చంద్రబాబు బాటలోనే శిష్యుడు రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు.