![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 05:06 PM
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు స్పందించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ నటి రేణు దేశాయ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇక ఈ వివాదంపై ఇప్పటికే ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటుడు ప్రియదర్శి, దర్శకుడు వేణు ఉడుగుల, సంగీత దర్శకుడు మణిశర్మ, యాంకర్ రష్మీ గౌతమ్, ఈషా రెబ్బా తదితరులు కూడా స్పందించారు. తాజాగా ఈ వివాదంపై నటి సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. హెచ్‌సీయూ 400 ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడేలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన సమంత... కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ వేదికగా Change.org (సామాజిక సమస్యలపై ప్రశ్నించే సంస్థ) పిటిషన్‌కి సైన్ చేయాలని కోరారు.