![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 09:52 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల భయం వెంటాడుతున్నప్పటికీ... భారత స్టాక్ మార్కెట్ పుంజుకుంది. నిన్నటి నష్టాల నుంచి కోలుకుంది. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ రికవరీతో సెన్సెక్స్ 592.93 పాయింట్లు ఎగబాకి 76,617.44 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ గరిష్ఠంగా 76,680.35, కనిష్ఠంగా 76,064.94 మధ్య కదలాడింది.నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించి 166.65 పాయింట్లు లాభపడి 23,332.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 23,350, కనిష్ఠంగా 23,158.45 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ లోని 30 స్టాక్స్ లో 21 లాభాల్లో ముగిశాయి. జోమాటో, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ రియాల్టీ సూచీ 3.61 శాతం పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2.51 శాతం వరకు లాభపడ్డాయి. "ప్రపంచ అనిశ్చితుల నడుమ భారతీయ మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. కీలక రంగాల్లో కొనుగోళ్లు ఇందుకు సహకరించాయి" అని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. మార్చి నెలలో భారతదేశ ఉత్పాదక శక్తి పీఎంఐ ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరడం, ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ ఆదాయాలు పుంజుకునే అవకాశం ఉండటం సెంటిమెంట్ ను మరింత బలపరిచాయి.