![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 07:46 PM
హైదరాబాద్ నగరంలో వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. సీసం గోలి సైజులో ఉన్న వడగళ్లు నగరంలోని పలు ప్రాంతాల్లో కురిశాయి. ఓ వైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం.. మరోవైపు భారీ ఈదురు గాలులు నగర ప్రజలను భయపెట్టాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బేగంపేట, నాంపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హస్తినాపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షానికి తోడు వడగళ్లు కురవటంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
నిన్నటి వరకు నగరంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. మార్చి చివరి వారంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటిగ్రేడ్ పైన ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. అయితే అనుహ్యంగా బుధవారం (ఏప్రిల్ 2) సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాడు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం, రాత్రి వేళ్లలోనూ గాలిలో తేమ శాతం పెరిగి చల్లని వాతావరణం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో వాతావరణం మరింత చల్లబడింది.
రానున్న నాలుగు రోజులు వర్షాలు..ఒడిశా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకూ ఉన్న ద్రోణి, చత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉన్నత వాయు చక్రవాత తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేటి నుంచి ఏప్రిల్ 6 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు. నేడు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్డ్ జారీ చేశారు. వడగళ్లతో పాటుగా భారీ ఎత్తున ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.