![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 07:39 PM
మంచు వారి కుటుంబంలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య గొడవలు, కొట్లాటలు, కేసులతో అగ్గిరాజేసిన మంచువారి కలహాలు.. పోలీసులు కౌన్సిలింగులతో కాస్త సద్దుమణిగినట్టు కనిపించాయి. కానీ అవి నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నట్టుగా.. తాజా పరిణామం చూస్తే అర్థమవుతోంది. మంచు మనోజ్ మరోసారి తన సోదరుడు మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈసారి ఏకంగా 150 మంది తన ఇంట్లో చొరబడ్డారని.. తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకుపోయారంటూ ఫిర్యాదు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మంచు విష్ణుపై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్.. కంప్లైంట్‌లో కీలక విషయాలు వెల్లడించాడు. మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. జల్‌పల్లిలోని తన నివాసంలోకి 150 మంది వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారని.. వారు తనకు చెందిన కారు, వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లారని ఆరోపించాడు. అయితే.. ఈ దాడి అనంతరం.. చోరీకి గురైన తన కారు ఇప్పుడు మంచు విష్ణు ఆఫీసులో కనిపిస్తోందని మనోజ్ పోలీసులకు తెలిపారు. ఈ అంశంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి వాహన వివరాలు, సీసీటీవీ ఫుటేజ్, సాక్ష్యాలు సేకరిస్తున్నారు.
అయితే.. గతంలో జరిగిన గొడవల సందర్భంగా పోలీసులు మంచు ఫ్యామిలీకి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. కుటుంబ తగాదాలు ఏమైనా ఉంటే ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకోవాలని.. రోడ్డుపైకి వచ్చి రౌడీల్లా వ్యవహరించొద్దంటూ గట్టిగానే హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో.. ఈసారి జరిగిన దాడి విషయాన్ని కుటుంబ స్థాయిలో పరిష్కరించేందుకు తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆయన స్పందించలేదని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆయనతో మాట్లాడాలనుకున్నా.. కానీ ఆయన అందుబాటులో లేరు." అని మీడియాతో తెలిపారు.
నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల గుర్తింపు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. మంచు ఫ్యామిలీ మంటలు ఇంకా చల్లరనట్టున్నాయిగా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.