|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 04:58 PM
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం ద్వారా లబ్ధిదారులకు మంజూరైన ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలో ఫార్మీన్ బేగం ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, నిర్మాణానికి మార్కింగ్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి మంజూరైన ఇళ్లను సంబంధిత లబ్ధిదారులు వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అయితే, రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులను లబ్ధిదారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, నిరాశ్రయులు తమ స్వంత ఇంటిని నిర్మించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బాధ్యతాయుతంగా పనిచేసి, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.