|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 04:17 PM
దేశంలోనే నంబర్‌వన్ స్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కోహెడ వద్ద నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్లో కోహెడ మార్కెట్ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. కోహెడ మార్కెట్‌ను దేశంలోనే రోల్ మోడల్ మార్కెట్‌గా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని సీఎస్ వెల్లడించారు. ఇది ప్రభుత్వానికి ఒక 'డ్రీమ్ ప్రాజెక్టు' అని అన్నారు.
కోహెడ మార్కెట్‌ను 250 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్నారు. ఇందులో కోల్డ్ స్టోరేజ్‌లు (శీతల గిడ్డంగులు), విశాలమైన షెడ్లు, వెడల్పైన రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎస్ సూచించారు. తెలంగాణలో విస్తారంగా పండే మామిడి, బత్తాయి, పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేలా, రైతులు, వినియోగదారులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ఈ మార్కెట్ ప్రధాన లక్ష్యమన్నారు. కోహెడ మార్కెట్ ఏర్పాటుకు రూ.2890 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు సీఎస్‌కు తెలిపారు. భూ సేకరణ, రోడ్లు, ఆధునిక షెడ్లు, సోలార్ రూఫ్ టాప్‌లు, కోల్డ్ స్టోరేజ్‌లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఈ నిధులు అవసరమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్ర మోహన్, అదనపు డైరెక్టర్ లక్ష్మీ బాయి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా రైతులు, వినియోగదారులకు గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు.