|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:01 PM
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. గతంలో రెండు విడతలుగా ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇవ్వాలని భావించినా.. ఇప్పుడు ఒకేసారి రూ.12 వేలు జమ చేసే ఆలోచనలో ఉంది. ఇది రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని ఇస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో.. ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రైతు భరోసా పథకానికి సంబంధించి జూన్ మూడో వారంలోగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి నిధుల విడుదలను ఒకే విడతలో చేసే సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకేసారి రూ.12 వేలు జమ చేస్తే.. పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సాగు పనులు ప్రారంభించుకోవచ్చు. ఇది వారికి గొప్ప ఆర్థిక భరోసాను అందిస్తుంది.
ప్రస్తుతం.. రైతు భరోసా సాయం 2025 జనవరి నుంచి విడతలవారీగా విడుదలవుతోంది. మొదటగా ఎకరం లోపు భూమి ఉన్నవారికి.. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు ఎకరాల వరకు విడతల వారీగా సాయం అందింది. ఇంకా నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు సాయం అందాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే వీరికి త్వరలోనే సాయం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జూన్ మొదటి వారంలోగా ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరోసారి రైతు భరోసా నిధులు విడుదల అయితే.. రైతులు భారీగా లాభపడతారు. ఇక నుంచి ఒకే దఫాలో రైతుభరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్తు తెలుస్తోంది.