|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:35 PM
జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిన్న రాత్రి విజయగర్వంతో ఊరేగింపు నిర్వహించాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.తమ కార్యకర్తపై దాడికి పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజం ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేటతెల్లమైందని ఆయన అన్నారు. గతంలో తాము అనేక ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. అలాంటి సమయంలో తాము కాంగ్రెస్ పార్టీ గుర్తును గాడిద మీద ఎక్కించి ఊరేగించామా? అని ప్రశ్నించారు. ఒక ఉప ఎన్నిక గెలిచినందుకే ఇంత అహంకారమా అని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును క్రేన్‌తో లాక్కెళ్లడం సరికాదని అన్నారు.