|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:22 PM
కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రతిష్ఠాత్మక 'కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్' (కేఎస్‌డీఎల్) ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా ప్రస్థానం మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఆమె రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఇదే సందర్భంలో, చారిత్రక మైసూర్ శాండల్ సోప్‌ను సరికొత్త, ఆధునిక రూపురేఖలతో తిరిగి మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ ప్రకటించారు.యువతను ఆకట్టుకోవడం ద్వారా కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న తమన్నా నియామకం ద్వారా, ముఖ్యంగా ఉత్తర భారత మార్కెట్‌లో కూడా మైసూర్ శాండల్ సోప్‌కు బలమైన డిమాండ్ సృష్టించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం, ఈ రెండేళ్ల కాలంలో తమన్నా ఇతర ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఇలాంటి ఉత్పత్తులకు ప్రచారం చేయరు.2030 నాటికి కంపెనీ టర్నోవర్‌ను రూ. 5,000 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి పాటిల్ స్పష్టం చేశారు. ఇందుకోసం విజయపుర, దాబస్‌పేట పారిశ్రామిక ప్రాంతాల్లో త్వరలో కొత్త ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ. 25-30 కోట్లుగా ఉన్న ఎగుమతుల టర్నోవర్‌ను రెట్టింపు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
Latest News