|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 01:51 PM
ఫంకీ' చిత్రం ప్రతి ఒక్కరినీ విపరీతంగా నవ్విస్తుంది: మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ప్రేమికుల దినోత్సవం కానుకగా థియేటర్లలో నవ్వుల జల్లు కురిపించడానికి వస్తున్న చిత్రం 'ఫంకీ'. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'ఫంకీ' చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. బుధవారం సాయంత్రం ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ."ప్రతి సినిమా విడుదలకు ముందు నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ ఫంకీ విడుదలకు ముందు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను. మన టైం బాగున్నప్పుడు, మన సినిమాలు బాగా ఆడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ, నా గత రెండు చిత్రాలు కాస్త నిరాశపరిచినప్పటికీ. నాతో పాటు నిల్చొని, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. మీ ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. జీవితంలో అప్పుడప్పుడు పడిపోతుంటాం. పడటం తప్పు కాదు. తిరిగి మళ్ళీ నిలబడకపోవడం తప్పు. మీ అందరి ప్రేమ వల్లే నేను ఇక్కడ నిలబడ్డాను. ఫంకీ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. పరిస్థితులు బాలేని సమయంలో ఇంత అద్భుతమైన సినిమా నా దగ్గరకు వచ్చింది. ఆ దేవుడే పంపించాడు అనిపించింది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు అనుదీప్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. చినబాబు గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో ఆయన దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ సినిమా విపరీతంగా నవ్విస్తుంది. కయాదు లోహర్ తో నా జోడి చక్కగా కుదిరింది. తనలో ఎంతో ప్రతిభ ఉంది, కష్టపడే తత్త్వం ఉంది. కయాదుకి మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం నేను నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలోనే జరిగింది. ఇప్పుడు ఫంకీకి ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని అలరించేలా ఫంకీ ఉంటుంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమా మిమ్మల్ని అసలు నిరాశపరచదు" అన్నారు.
కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ."మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు మాటలు కూడా రావడంలేదు. ఫంకీ టీజర్, ట్రైలర్, పాటలకు మీరిచ్చిన అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న థియేటర్లలో ఫంకీ సినిమాను చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అనుదీప్ గారి శైలి కామెడీ ఉంటుంది. విశ్వక్ సేన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమాలో నేను పోషించిన చిత్ర పాత్రపై ప్రేమ కురిపిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ."అందరికీ నమస్కారం. ఫంకీ సినిమా గురించి చెప్పాలంటే ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్ళి. ప్రారంభం నుంచి చివరి వరకు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. విశ్వక్ సేన్, కయాదు లోహర్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నాతో కలిసి స్క్రిప్ట్ రాసిన జగన్ గారికి, కెమెరామ్యాన్ సురేష్ గారికి థాంక్స్. భీమ్స్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ఈ అవకాశమిచ్చిన నిర్మాత నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా ఫంకీ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.
Latest News