by Suryaa Desk | Sun, Jul 14, 2024, 07:49 PM
టెక్నాలజీలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి అందరిక్షానికి అలవోకగా వెళ్లగలుగుతున్నాడు. చంద్రమండలానికి శాటిలైట్లు పంపిస్తున్నారు. అరచేతిలోనే ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఏది కావాలన్నా కూర్చున్న చోటికే తెప్పించుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు మాత్రమే.. ఇంకోవైపున ప్రజలు ఇప్పటికీ మూడనమ్మకాలను వదలట్లేదు. ఇప్పటికీ పిల్లి అడ్డం వచ్చిందని ప్రయాణాలు మానుకోవటం, తుమ్మితే ఆగిపోవటం.. లాంటివి ఇంకా పాటిస్తూనే ఉన్నారు. అంతే కాదు.. లంకెబిందెలు, గుప్త నిదుల కోసం కొందరు క్షుద్రపూజలు కూడా చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
చందపల్లి ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ సమీపంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శనివారం రోజున అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు.. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపాటి గుడిసె వేసి.. పెద్ద పెద్ద గొయ్యిలు తవ్వారు. ఆ గుంతల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేశారు. అయితే.. వేకువజాములు వాకింగ్ కోసం అటుగా వచ్చి స్థానికులు.. పెద్ద పెద్ద గుంతలు అందులో పసుపు, కుంకుమ, పసుపు పూసిన నిమ్మకాయలు, గడ్డపార, పార చూసి తీవ్ర భయాందోళకు గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్పాట్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ క్షుద్రపూజలు.. గుప్త నిధుల కోసమా లేక... అమాయకపు ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని భయపెట్టి సొమ్ము చేసుకునేందుకు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటన వెలుగులోకి రావటంతో.. స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇలాంటి సన్నివేశాలు పలు చోట్లలో తరచూ కనిపిస్తూ.. స్థానికులను భయపెడుతున్నాయి. అయితే.. ఇదంతా ఓ పెద్ద మూడనమ్మకమని వివరించినా.. కొంత మంది మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నారు. అయితే.. ఈ పూజల వల్ల గుప్తు నిధులు దొరుకుతాయనో.. లేదా ప్రత్యర్థుల నాశనం జరుగుతుందనో ప్రజలు నమ్ముతూ ఈ మూర్ఖపు పద్దతులను ఇంకా అవలంభిస్తుండటం.. శోచనీయం.