by Suryaa Desk | Mon, Nov 11, 2024, 09:49 PM
వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలకు బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో సాగు చేసే సోనామసూరి, హెచ్‌ఎంటీ, సాంబమసూరి, జేజీఎల్, ఎంటీయూ- 1010, ఐఆర్- 64 వెరైటీలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ బియ్యానికి బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలే కాకుండా అమెరికా, యూఏఈ, ఉత్తర కొరియా దేశాల్లో డిమాండ్ ఉందన్నారు.
ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉత్తమ్.. తెలంగాణలో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందన్నారు. ఈసారి 7,700 కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్పారు. అందుకు కావాల్సినన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గత యాసంగి పంట కొనుగోళ్ల సమయంలో చాలా వేగంగా మూడు నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోళ్ల డబ్బులు జమ చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సమయం పట్టేదని.. అప్పుడా పరిస్థితి లేదని అన్నారు. పొరుగు రాష్ట్రంలో మిల్లర్లకు ధాన్యమిస్తే 100 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల తెలంగాణలో మాత్రం అది జరగలేదన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తాము సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు. మిల్లింగ్ ఛార్జీ గతంలో రూ.10 ఉంటే.. ఇప్పుడు సన్నాలకు రూ.50కు, దొడ్డు రకాలకు రూ.40కు పెంచినట్లు వెల్లడించారు. అయినా కొందరు మిల్లర్లు 100 శాతం బ్యాంకు గ్యారంటీకి ముందుకు రావడం లేదని వెల్లడించారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం నిల్వ కోసం 30 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములను సిద్ధిం చేసనట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సివిల్ సప్లయ్ శాఖ అప్పు రూ.58 వేల కోట్లుగా ఉండేదని అన్నారు. శాఖను గాడిలో పెట్టి.. అప్పును రూ.47 వేల కోట్లకు తగ్గించినట్లు తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.