by Suryaa Desk | Mon, Nov 11, 2024, 07:37 PM
తెలంగాణలో కొత్త రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త రోడ్లకు, రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అత్యంత రద్దీగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించున్నారు. ఆ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ముంబయి నేషనల్ హైవేకు అనుసంధానంగా అంతారం వైపు వెళ్లే రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి.
తాండూరు పట్టణం నుంచి అంతారం వైపు రహదారిని విస్తరించేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపారు. రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోడ్డును విస్తరించడానికి ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనల ప్రకారం.. 2024లో నిధులు మంజూరయ్యేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేశారు. తాండూరు పట్టణానికి నాలుగు వైపులా 4 లైన్ హైవే ఉండాలనే ఉద్దేశంతో తాండూరు- అంతారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. తాండూరు గౌతాపూరు వైపునకు ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి అందుబాటులో ఉంది. తాండూరు-వికారాబాద్ వైపు సైతం రోడ్డు విస్తరణకు రూ.48.80 కోట్లు మంజూరయ్యాయి. తాండూరు- కొడంగల్ వైపు 4 లైన్ హైవే విస్తరణకు రూ.39 కోట్లు మంజూరయ్యాయి.
తాండూరు-అంతారం రహదారిని 2 వరుసల నుంచి 4 వరుసలుగా విస్తరించనున్నారు. అందుకు రూ.15 కోట్ల అంచనా వ్యయం రూపొందించారు. మెుత్తం 2.5 కిలో మీటర్ల రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఈ ఏడాది జులైలో విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే డిజిటల్ సర్వే పూర్తి చేసి పనులు ప్రారంభించారు. వారం క్రితం వరకు కాంట్రాక్టర్ బైపాస్ రోడ్డు కూడలి కలిసే వరకు ఉన్న రోడ్డకు రెండు వైపులా తవ్వకాలు చేపట్టారు. అవసరమైన చోట్ల కల్వర్టుల నిర్మాణం కూడా పూర్తి చేశారు. రెండు రోజుల నుంచి రోడ్డుకు ఒక వైపున తారును కూడా వేయటం ప్రారంభించారు. మరో నెలలో రోడ్డు విస్తరణ పనులు పూర్తికానుండగా..అటుగా వెళ్లే వాహనదారులు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా ప్రయాణాలు చేయనున్నారు.