by Suryaa Desk | Mon, Nov 11, 2024, 07:23 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి వెళ్లిన ఆయనకు నిరసన తెగ తగిలింది. దుద్యాల మండలంలోని దుద్యాల, లగచర్ల, పోలేపల్లి గ్రామాలలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాన్ని సేకరించేందుకు నేడు ఆయా గ్రామాల్లోని రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే తమ గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం దుద్యాల గ్రామ శివారులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - కడా.. ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వచ్చారు.
అయితే దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంటే రైతులు మాత్రం అక్కడికి వెళ్లకుండా లగచర్లలోనే ఉండిపోయారు. అదే సమయంలో గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి బాధిత రైతుల తరఫున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరిలో ఉన్నారని.. అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్, ఇతర అధికారులు అంగీకరించి అక్కడికి బయల్దేరి వెళ్లారు.
కలెక్టర్ గ్రామానికి రాగానే నిరసన వ్యక్తం చేశారు. 'కలెక్టర్ డౌన్ డౌన్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన పైకి దూసుకెళ్లారు. కలెక్టర్ వారించినా వినకుండా దాడికి యత్నించారు. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటతో పోలీసులు కలెక్టర్‌ను అక్కడి నుంచి పంపించారు. అయితే కలెక్టర్ కారుతో పాటు ఇతర అధికారుల కార్లపై గ్రామస్తులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో వాహనాలను ధ్వసం చేశారు. కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టర్, అధికారులు బందోబస్తు లేకుండా వెళ్లడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సరైన పోలీసు భద్రత లేకపోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయి జిల్లా కలెక్టర్‌నే పరుగులు పెట్టించారు.