by Suryaa Desk | Mon, Nov 11, 2024, 10:39 PM
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో.. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన అంశాలు హాట్ టాపిక్‌గా మారగా.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవటం, ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం కావటం.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా మాజీ ఎమ్మెల్యేకు అధికారులు నోటీసులు జారీ చేయగా.. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లటం సర్వత్రా చర్చకు తెరలేపింది. ఇక ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు.. కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం (నవంబర్ 11న) పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి.. కేసీఆర్ దొర పోకడలు గత పదేళ్లు చూశానని.. ఆయన చుట్టూ పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టుకుని మాట్లాడేవారని ఆరోపించారు. కార్యకర్తలు జారిపోకుండా ఉండేందుకే.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందంటూ కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం పేదోడిని కూలగొట్టదని.. కేసీఆర్ తొత్తులు అక్రమంగా కట్టడాలు కడితే వాటిని పేదలకు ఇవ్వడం కోసమే కూల్చుతున్నామంటూ పొంగులేటి చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐలపై విమర్శలు చేసే కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటూ ప్రశ్నించారు పొంగులేటి. కేంద్ర పట్టణ శాఖ మంత్రితో కేటీఆర్‌కు పని ఏముందని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో నిర్వహించిన ఫార్మూలా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని గుర్తించి.. కేసు ఏసీబీకి అప్పగించామని తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో అతడిని ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగానే విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసి 13 రోజులు అయ్యిందని పొంగులేటి వెల్లడించారు.
కేంద్రంలో ఉన్న అర్బన్ మంత్రితో పాటు అదానీ, అంబానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లారంటూ పొంగులేటి ఆరోపించారు. బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని.. తమకు సమాచారం ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. రాబోయే రెండు రోజుల్లో ఏ బాంబు పేలబోతుందో తెలిసి కేటీఆర్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లారని చెప్పుకొచ్చారు.
అయితే.. ఏడేడు లోకాల అవతల ఉన్నా.. తప్పు చేస్తే ఏ దొరనూ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఒక్కొటి బయట పెడితే ఆ పార్టీ నాయకులు అంతరిక్షానికి వెళ్లి దాక్కుంటారేమో అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు.