by Suryaa Desk | Mon, Nov 11, 2024, 10:41 PM
సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టింది. 13 మంది ఐఏఎస్ అధికారులకు స్థానభ్రంశం కల్పిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం (నవంబర్ 11న) సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా.. ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి.. స్మితా సబర్వాల్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్‌ను నియమిస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న ఇ. శ్రీధర్‌ను బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా కొనసాగుతోన్న అనితా రామచంద్రన్‌ను.. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్ బదిలీ చేశారు. ఇక.. ఏపీకి ట్రాన్స్‌ఫర్ అయిన ఆమ్రపాలి స్థానంలో జీహెచ్‌ఎంసీ తాత్కాలిక కమిషనర్‌గా నియమించిన ఇలాంబర్తినే పూర్తి స్థాయి కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ఇక.. మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీ సురేంద్రమోహన్‌ను ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఫైనాన్స్, ప్లానింగ్ సెక్రటరీ కృష్ణభాస్కర్‌ను ట్రాన్స్‌కో సీఎండీగా బదిలీ చేశారు. డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగా ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.
మరోవైపు.. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న చెరువు హరికృష్ణను ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్‌లో ఉన్న మరో ఐఏఎస్ శ్రీజనను పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించారు. లేబర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణాదిత్యను ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా బదిలీ చేశారు. లేబర్ కమిషనర్‌గా సంజయ్ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. మరోవైపు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను జేఏడీ (కో ఆర్డినేషన్) సెక్రటరీగా నియమిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించిన స్మితా సబర్వాల్‌కు.. రేవంత్ రెడ్డి సర్కారులో ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించగా.. ప్రస్తుతం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పటంపై ఆమె అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్మితా సబర్వాల్ ఏ శాఖలో ఉన్నా తనదైన వర్కింగ్ స్టైల్‌తో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేస్తారన్న టాక్ ఉంది. కాగా.. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఉన్న టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ స్మితా సబర్వాల్‌కు సరిగ్గా సెట్ అవుతుందంటూ ఆమె అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి.