by Suryaa Desk | Tue, Nov 12, 2024, 10:41 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు.ఏఐసిసి (AICC) అంతర్గత సమావేశంలో ఆయన పాల్గొంటారు. మంగళవారం మధ్యాహ్నం ఇండియన్ ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఢిల్లీ నుంచి మహరాష్ట్రకు బయలుదేరి వెళతారు. బుధవారం మహరాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముంబైలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తిరిగి రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.కాగా ''పది నెలల్లో తెలంగాణ ఏం కోల్పోయిందో తెలిసి వచ్చిందని నిన్న, మొన్న ఒక పెద్దాయన మాట్లాడుతున్నడు. ఏం కోల్పోయిందయా.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. తెలంగాణలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. రైతులకు రుణ మాఫీ జరిగింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, పేదలకు ఉచిత విద్యుత్తు, రూ.500లకే సిలిండర్‌ను ఈ ప్రభుత్వం ఇస్తోంది. రాష్ట్రానికి ఏమీ బాధ లేదు నాయనా.. నువ్వు సంతోషంగా అక్కడే పండుకో.. నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది'' అంటూ మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు గాడిద గుడ్డు ఇచ్చారని, అయినా, బుద్ధి మారలేదని విమర్శించారు. ఇప్పటికైనా మారాలని, ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని, నిర్ణయాల్లో లోపాలుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు చేయాలని కోరారు.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎంవీఐ)గా ఎంపికైన 96 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేందుకు ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్, కలెక్టర్ అనుదీప్, జాయింట్ కమిషనర్ రమేశ్ చిదురతో కలిసి పది మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా.. ఈ పది నెలల్లో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. టీచర్లకు పదోన్నతులు ఇచ్చామని, బదిలీలు చేశామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించామని, త్వరలో 563 మంది అధికారులను తెలంగాణకు అందిస్తామని తెలిపారు. ''బడి దొంగలను విన్నాం. కానీ.. అసెంబ్లీకి రానోళ్లను ఎప్పుడైనా చూశామా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అడగాలి. కడగాలి. ఆయన రానే రాడు. ఉల్టా అయిపోయింది. రమ్మని మేం అడుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఉంది'' అని విమర్శించారు.
దీపావళికి చిచ్చు బుడ్లతో పండుగ చేసుకుంటామని, కానీ, కొంతమంది సారా బుడ్లతో దావత్ చేసుకున్నామని అంటున్నారని, ఆ దావత్‌లో డ్రగ్స్ తీసుకున్నోళ్లు దొరికితే వాళ్లను ఎలా పట్టుకుంటారని అడుగుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లు సమాజానికి చీడ పురుగులని, వారిని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ఫామ్ హౌస్‌ల్లో డ్రగ్స్ తీసుకునే వాళ్లు మనకు ఆదర్శం కాదని స్పష్టం చేశారు. ''మన పిల్లలు చెడిపోతే మనం ఎంత గొప్పవాళ్లమైనా.. ఎంత సంపాదించినా.. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వృథానే. మనం ఎంత సాధించినా నిష్ప్రయోజనమే. వ్యసనాలకు బానిసలైన పిల్లల వల్ల కుటుంబాలు కుప్పకూలుతయి. పిల్లలను నియంత్రించేలా మనం సామాజిక బాధ్యతగా సహకరించాలి. పక్క రాష్ట్రాలు, దేశాల నుంచి రోడ్డు మార్గంలో డ్రగ్స్ వస్తున్నాయి. రవాణా, పోలీస్ విభాగాలు కఠినంగా ఉండాలి. గంజాయి వాసన వచ్చిందంటే కూకటివేళ్లతో పెకిలించాలి. తెలంగాణ సరిహద్దులో ఎవడైనా డ్రగ్స్‌తో కాలు పెట్టాలంటే వారి వెన్నులో చలి జ్వరం రావాలి'' అని దిశానిర్దేశం చేశారు. గంజాయి వ్యసనానికి బానిసలై ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, వైద్య విద్య చదివే పిల్లలు వాటిని అమ్మే దుస్థితికి దిగజారారని, ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు.
నెలకొక్కసారైనా స్వగ్రామాలకు వెళ్లండి
ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశమున్నా.. పరీక్షలు నిర్వహించకుండా నాటి పాలకులు బాధ్యతారహితంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులు, వివాదాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించి.. న్యాయస్థానాల్లో బలంగా వాదనలు వినిపించి, చిక్కుముళ్లు విప్పి.. పది నెలల్లో 50 వేల మందికి నియామక పత్రాలు అందించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆనాడు నిరుద్యోగులకు మాట ఇచ్చానని, మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారి ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందని, మీకు ఉద్యోగాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. ''గ్రామంలో ఎవరికైనా ఉద్యోగం వస్తే వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్లు చదువుతారు. మిమ్మల్ని చూసినప్పుడు ఇతర పిల్లల తల్లిదండ్రులకూ విశ్వాసం వస్తుంది. కుటుంబంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబ జీవన ప్రమాణాలు మారతాయి.
సామాజిక బాధ్యతగా భావించి నెలకు ఒక్కసారైనా స్వగ్రామాలకు వెళ్లండి. ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులతో మాట్లాడండి. వాళ్లకు ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించండి. చదువు సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుందనే అవగాహన కల్పించండి'' అని సూచించారు. ఉద్యోగం బాధ్యత కాదని, భావోద్వేగమని అన్నారు. పది కాలాలపాటు పేదల కష్టాలు తీర్చేందుకు సామాజిక బాధ్యతగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి నగరంలో కాలుష్యాన్ని తగ్గించనున్నామని, ఇక్కడి డీజిల్ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పంపుతామని చెప్పారు. హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకు వస్తామని, ఇందుకు రవాణా శాఖ సహకరించాలని కోరారు. రెండో విడత అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులకు రెండో విడత ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగుల సేవలను చెక్ పోస్టుల్లో కాకుండా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో వినియోగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రోజూ సగటున 20 మంది మృతి చెందుతున్నారని, సురక్షిత ప్రయాణాలకు రవాణా శాఖ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.