by Suryaa Desk | Sun, Nov 10, 2024, 11:13 PM
హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్‌లో సత్తా చాటనున్నారు. రియాద్‌లో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను 2025 జనవరిలో ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో రైలు వ్యవస్థల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం చెబుతోంది. లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు. మెట్రో రైళ్లను నడపడం, స్టేషన్ల ఆపరేటింగ్‌లో ఆమెకు విశేష అనుభవం ఉంది.
ఇందిర నైపుణ్యాలను గుర్తించి రియాద్ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఆమెను ఎంపిక చేశారు. భారత్ నుంచి ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ ప్రాజెక్టు కోసం ఎంపికయ్యారు. రియాద్ మెట్రో ప్రాజెక్టు కోసం ఐదేళ్లుగా ఇందిర.. అక్కడ ఐదేళ్లుగా శిక్షణ పొందారు. మెట్రో రైలు లోకో పైలట్, స్టేషన్ ఆపరేషన్స్ మాస్టర్‌గా తన పాత్ర కోసం సిద్ధమయ్యారు.
రియాద్ మెట్రో ప్రాజెక్టు కోసం ఇందిర 2019లో అక్కడికి వెళ్లారు. అయితే, ఆమె అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకే కోవిడ్-19 సంక్షోభం వచ్చింది. పాండమిక్ సమయంలో ఆమె శిక్షణ నెమ్మదించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. ఇప్పుడు రియాద్ మెట్రో ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ఇందిర ఇప్పటికే ట్రయల్ రైళ్లను నడుపుతున్నారు. అధికారికంగా నడిపేందుకు ముహూర్తం కోసం ఎదరుచూస్తున్నారు. ‘భారతీయ మహిళగా, తెలుగు బిడ్డగా.. ఒక ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకెంతో గర్వకారణం. రియాద్ మెట్రోతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవం’ అని ఇందిర అన్నారు. తన చెల్లెలు, భర్త స్ఫూర్తితో లోకో పైలట్ శిక్షణ పొందారు ఇందిర.
వాస్తవానికి ఇందిర ఈగలపాటి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ధూళిపాళ్ల. 2006లో వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. ఇందిర చెల్లెలు లోకో పైలట్‌గా శిక్షణ తీసుకొని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో రైళ్లను ఆపరేట్ చేస్తున్నారు. ఇందిర భర్త ‘రియాద్ మెట్రో మెయింటెనెన్స్’ విభాగంలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. వారిద్దరి స్ఫూర్తి, ప్రోత్సాహంతో లోకో పైలట్ శిక్షణ తీసుకున్న ఇందిర.. రియాద్ మెట్రో ప్రాజెక్టుకు ఎంపికయ్యారు.
2022 ఎఫ్ఐఎఫ్ఏ ప్రపంచ కప్ సమయంలో దోహా, ఖతార్‌లో భద్రతా పరమైన విధులు నిర్వహించారు ఇందిర ఈగలపాటి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పనిపట్ల నిబద్ధత గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు తెలుగువారి కీర్తి పతాకను ప్రపంచ యవనికపై మరోసారి ఎగరవేసేందుకు ఇందిర సిద్ధమయ్యారు.