by Suryaa Desk | Sun, Nov 10, 2024, 07:29 PM
హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. నగరంలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల దృష్ట్యా రేపు (నవంబర్ 11) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీరు అందించే మంజీరా ఫేజ్-2 పైపులలో భారీ లీకేజీలను జలమండలి అధికారులు గుర్తించారు. కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా PSC పైపుల్లో ఏర్పడిన లీకేజీల వల్ల ఈ ప్రాంతంలో నీటి వృథా భారీగా జరుగుతోందని జలమండలి అధికారులు గుర్తించారు. ఈ లీకేజీల మరమ్మతులు చేసేందుకు జలమండలి అధికారులు ఈ నెల 11న సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ 24 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు వస్తుందని చెప్పారు.
ప్రధానంగా ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, లింగంపల్లి, గంగారం, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, చందానగర్, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌పీ, మూసాపేట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని చెప్పారు. ఈ ప్రాంతాల ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు ఈ సమస్యను అర్థం చేసుకుని సహకరించాలని అధికారులు సూచించారు. ఈ లీకేజీలను తొందరగా పరిష్కరించేందుకు జలమండలి శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యాక స్థానిక ప్రజలకు నాణ్యమైన నీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక హైదరాబాద్ నగరవాసుల తాగు నీటి కష్టాలు తీర్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. మల్లన్నసాగర్ నుంచి జంట నగరాల (హైదరాబాద్, సికింద్రాబాద్) తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల గోదావరి జలాలు తరలించేందుకు రెడీ అయింది. జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు 5 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించనున్నారు. ఈ వారంలోనే టెండరు ప్రక్రియ మొదలు కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.5560 కోట్ల పనికి త్వరలో టెండర్ నోటీసు విడుదల కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
నీటి మళ్లింపులో భాగంగా ముందుగా మల్లన్నసాగర్ నుంచి శామీర్‌పేట వద్ద గల ఘనపూర్‌కు నీటిని తరలించనున్నారు. అక్కడ 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ నీటిని నేరుగా హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. మిగిలిన 5 టీఎంసీల నీటిని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు డైవర్ట్ చేయనున్నారు.