by Suryaa Desk | Sun, Nov 10, 2024, 06:57 PM
శుక్రవారం వరకు స్టిక్కరింగ్ పూర్తి చేసి శనివారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా మెట్ పల్లి పట్టణంలో శనివారం నాటికి సైతం స్టిక్కరింగ్ పూర్తి కాలేదు. స్టిక్కరింగ్ పూర్తి చేయకుండానే శనివారం ఇంటింటి సర్వే ప్రారంభించారు. ఒక్కో ఎన్యుమరేటర్ టీంకు 170 గృహాలను కేటాయించారు. ముందుగా తమకు కేటాయించిన ప్రతి గృహాన్ని సందర్శించి గృహం బయట సర్వేకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన స్టిక్కర్ అతికించాల్సి ఉంటుంది.
స్టిక్కర్ అతికించే కార్యక్రమాన్ని శుక్రవారం వరకు పూర్తి చేసి శనివారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్యుమరేటర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పూర్తిస్థాయిలో స్టిక్కర్ అతికించే కార్యక్రమాన్ని చేపట్టకుండానే ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. స్టిక్కర్ అతికించకపోవడం వల్ల తమ వివరాలు నమోదు చేయరేమోనన్న ఆందోళన పట్టణ ప్రజలలో నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో స్టిక్కర్లు అతికించే కార్యక్రమం పూర్తి చేశాక ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.