by Suryaa Desk | Sun, Nov 10, 2024, 06:03 PM
మున్సిపల్ కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు రాక కుటుంబ పోషణకు భారం అయిందని కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ ముందు మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... గత 3 సంవత్సరాల నుండి కోదాడ మున్సిపాలిటీలో 110 మంది కమాటీలు కొలువు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, మాతో అన్ని రకాలుగా పారిశుద్ధ్యం పనులు చేయించుకొని జీతం అడిగితే ఇవ్వటం లేదని అగ్రహ వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ కార్మికుల జీతాలు ఇవ్వడంలో సంబంధిత అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా కార్మికులు కోరారు.
గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వాలని కార్మికులు చేస్తున్న అభియోగం సరైనది కాదని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. మూడు నెలల జీతం మాత్రమే ఇవ్వాలని ఆందోళన చేస్తున్న కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు కాదని, రోజువారి కూలీ కార్మికులని తెలిపారు. కార్మికులకు ముందే చెప్పాం బడ్జెట్ ఉన్నప్పుడు జీతాలు చెల్లిస్తామని,త్వరలోనే జీతాలు చెల్లిస్తాంమని తెలిపారు.