by Suryaa Desk | Mon, Nov 11, 2024, 09:50 PM
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చలి పులి పంజా విసురుతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
శనివారం అర్ధరాత్రి పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మెదక్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు చెప్పారు. ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరులో 16.2, దుండిగల్‌లో 18, నిజామాబాద్‌లో 18.7, రామగుండం, హనుమకొండ, హకీంపేటల్లో 19, హైదరాబాద్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదనట్లు చెప్పారు. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం 32 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఆస్తమా, ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని. వెచ్చటి ఉన్ని దుస్తులు ధరించాలని అంటున్నారు. ఇక ఉదయం వేళల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మంచు కారణంగా రోడ్డు ప్రమదాలు జరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని చెబుతున్నారు.
ఇక నైరుతి బంగాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీతో పాటుగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని ఈనెల 12 తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.