by Suryaa Desk | Mon, Nov 11, 2024, 09:52 PM
హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ దారులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ దగ్గర ఉన్న బస్‌పాస్‌తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌లో 10 శాతం స్పెషల్ డిస్కౌంట్‍ను ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందన్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్‌పాస్ దారులు సైతం ఈ రాయితీని పొందవచ్చునని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని చెప్పారు.
"హైదరాబాద్ నగరంలో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వీకెండ్‌లో సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చు. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం." అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జానర్ ట్వీట్ చేశారు.
ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరమశివుణి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని యాజమాన్యం ప్రకటిచంచింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించాలని అధికారులు సూచించారు.