by Suryaa Desk | Mon, Nov 11, 2024, 07:42 PM
తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని ఇది వరకే సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సూచించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. అయితే అక్కడక్కడ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తేమశాతం, తూకం విషయంలో కొందరు వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు సీఎం దృష్టికి రావటంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు రకం వడ్లు 23,58,344 ఎకరాల్లో రైతులు సాగు చేయగా.. 36,80,425 ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. దొడ్డు రకం వరి ధాన్యం 42.37 లక్షల టన్నులు, సన్న వరి ధాన్యం 48.91 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ హామీ మేరకు సన్న వరి ధాన్యం అమ్మిన రైతులు బోనస్ రూ.500 కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు ఊరటనిచ్చేలా ఆ డబ్బులు రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి క్వింటాకు రూ.500 చొప్పున రూ.2,445 కోట్ల బోనస్ డబ్బులు రైతులకు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.